Telugu Poetry | భక్తి పుష్పాంజలి: ప్రకృతి, ప్రాణం, పరమాత్మల త్రివేణి సంగమమే జీవన సార్థకత

0
3
Telugu Poetry

మానవ దేహమే దేవాలయమని వేదాలు ఘోషిస్తున్నా.. బాహ్య అలంకారాలకు ప్రాధాన్యతనిస్తూ అంతరాత్మను మరిచిపోతున్న ప్రస్తుత సమాజ తీరుపై ప్రముఖ రచయిత్రి, మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి గారు తన కలం ద్వారా భక్తి పుష్పాంజలి సమర్పించారు. ప్రకృతి, ప్రాణం, పరమాత్మల అనుసంధానమే నిజమైన జీవన సార్థకత అని చాటిచెప్పే వారి అద్భుత కవిత మీకోసం:

నీ పాద ధూళి పుప్పొడి రేణువులం మేము..!

నీ పాద ధూళి పుప్పొడి రేణువులం మేము..!

నీ కరుణామృత సింధు తరంగములం మేము..!

నీ కరస్పర్శ సౌభాగ్యమున సవరం చేసి…

మలిన చిత్తాంబుజమున మణిదీపమై వెలుగు తల్లి..!

దేహమే దేవాలయమని వేదం గానమాడగా…

దేహాన్నే భారమని భావించి తిరుగుతున్నాం..!

అంతరాలయంలో కొలువైన దేవుణ్ణి మరచి…

అలంకారాల గర్భంలో ఆత్మను దాచుకున్నాం..!

ప్రేమయే పరమపదమని నీ పలుకులు పలికినా…

పగలను పూజించి ద్వేషాన్ని హృదయంలో నిలుపుకున్నాం..!

కరుణయే కైలాసమని నీ చూపులు బోధించినా…

కఠినత్వపు శిలలతో మనసును ముసుగు చేసుకున్నాం..!

నీ దయా జలధార ఒక చుక్క తాకగానే…

ఎండిన ఆశల నేలలో ఆనంద మొగ్గలు తొడిగెను..!

నీ నామస్మరణ ఒకసారి పలికగానే…

అజ్ఞానాంధకార గుహలలో జ్ఞానసూర్యుడు ఉదయించెను..!

తల్లి…! నీ పాదసేవలో పర్యావరణ పరిరక్షణ పూజగా మారాలి..!

నీ ఆశీస్సులతో ఆరోగ్య జీవనం యోగంగా వికసించాలి..!

రచన:(Telugu Poetry)

మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం

చరవాణి: 9347042218

Pathipat Manjuala

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here